చంద్రబాబూ..మరీ ఇంత దిగజారుడా? అనంతపురం అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంత! Youth and super six!
చంద్రబాబూ..మరీ ఇంత దిగజారుడా?
అనంతపురం అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంత!
–స్వాతంత్య్ర వేడుకల ప్రసంగంతో యువతకు ఏం సందేశమిస్తున్నావ్
– సరసమై ధరకు నాణ్యమైన మద్యమిచ్చాం..తాగమంటున్నావా?
– కూటమి తొలి ఏడాది పాలనలో సూపర్ సిక్స్ హామీలకు మంగళం
– రెండో ఏడాదిలో ఆంక్షలు, కోతలతో అరకొర పథకాలు
– ఆడబిడ్డ నిధి, యువతకు నిరుద్యోగ భృతి ఏదీ?
– 50 ఏళ్లకే పింఛన్ ఇస్తాన్న హామీ ఏమైంది?
– ఉచిత బస్సు ప్రయాణమంటూనే ఆంక్షలా?
– కూటమి పాలనలో క్షీణించిన శాంతిభద్రతలు
– పోలీసుల ఉదాసీనతతోనే మొన్న తన్మయి..నేడు శ్రావణి మరణాలు
– శ్రావణి ఆత్మహత్యపై సమగ్ర విచారణ చేసి చర్యలు తీసుకోవాలి
– ఎమ్మెల్యేల చేతుల్లో కీలుబొమ్మలుగా పోలీసులు
– చంద్రబాబు సీఎం అయ్యాక దయనీయ స్థితిలో రైతాంగం
– ఖరీఫ్‌లో ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టిపెట్టరా?
– ధనార్జనే తప్పితే రైతాంగం కష్టాలు ఎమ్మెల్యేలకు పట్టదా?
– వైసీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి ధ్వజం
అనంతపురం, ఆగస్టు 16 : G9tvNewslive
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల ప్రసంగంలో ముఖ్యమంత్రి చంద్రబాబు దిగజారి మాట్లాడారని వైసీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి అన్నారు. ‘‘సరసమైన ధరలకు నాణ్యమైన మద్యం ఇస్తున్నామనడం సిగ్గుచేటు..సీఎం స్థాయిలో ఉండి ఇలా మాట్లాడతారా? యువతకు మీరిచ్చే సందేశం ఇదేనా?’’ అని ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల అమలులో వైఫల్యం చెందిన చంద్రబాబు ప్రతి విషయంలోనూ ప్రచార ఆర్భాటం చేసుకుంటున్నారని దుయ్యబట్టారు. శనివారం వైసీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు కలిసి చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు కావస్తోందన్నారు. తొలి ఏడాది పాలనలో సూపర్ సిక్స్ హామీ ఒక్కటి కూడా అమలు చేయలేదన్నారు. రెండో ఏడాదిలో కోతలు, ఆంక్షలు పెట్టి పథకాలు అమలు ప్రారంభించారని విమర్శించారు. తొలి ఏడాది చంద్రబాబు ఇచ్చిన హామీల విలువ అక్షరాలా రూ.80 వేల కోట్లని తెలిపారు. ఆ మేరకు ప్రజలకు బాకీ పడ్డారని తెలిపారు. కూటమి రెండో ఏడాది పాలనలో అన్నదాత సుఖీభవ ప్రారంభిస్తే అందులోనూ కోతలు పెట్టారన్నారు. ఎన్నికలకు ముందు రూ.20 వేలు ఇస్తామని చెప్పి ఇప్పుడు కేంద్రంతో కలిపి రూ.20 వేలు అంటున్నారన్నారు. అన్నదాత సుఖీభవ పథకంలో 7 లక్షల మందికి కోత పెట్టారని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పి ఇప్పుడు ఆంక్షలు పెట్టడం దారుణమన్నారు. కనీసం తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో ఫ్రీబస్సు పథకం అమలు చేసినట్టుగా కూడా ఇక్కడ చేయడం లేదన్నారు. అంతర్ రాష్ట్ర సర్వీసులు, ఎక్స్‌ప్రెస్, నాన్‌స్టాప్, లగ్జరీ బస్సుల్లో ప్రయాణ సౌకర్యం కల్పించకపోవడం ఏంటని ప్రశ్నించారు. చివరకు తిరుమలకు వెళ్లేందుకు కూడా మహిళలకు అవకాశం లేకుండాపోయిందన్నారు. ఇదంతా ఎవరిని మోసం చేయడానికని ప్రశ్నించారు. ఆడబిడ్డ నిధి కింద 18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ నెలకు రూ.1500 ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు ఈ పథకం ఊసే ఎత్తడం లేదని విమర్శించారు. నిరుద్యోగులకు ప్రతి నెలా రూ.3 వేల నిరుద్యోగ భృతి ఎప్పుడు ప్రారంభిస్తారని ప్రశ్నించారు. 50 ఏళ్లకే పింఛన్ అందిస్తానని హామీ ఇచ్చి ఇప్పటి వరకు ఒక్కరికీ ఇవ్వలేదన్నారు. కేవలం ఆర్భాట ప్రచారాల కోసమే చంద్రబాబు పరిమితం అవుతున్నారని మండిపడ్డారు.
*పోలీసుల ఉదాసీనత వల్లే శ్రావణి ఆత్మహత్య*
చంద్రబాబు పాలనలో శాంతిభద్రతలు క్షీణించాయని అనంత వెంకటరామిరెడ్డి తెలిపారు. ఐఏఎస్, ఐపీఎస్‌లు ప్రజాప్రతినిధుల చేతుల్లో కీలుబొమ్మలుగా మారారని ధ్వజమెత్తారు. ‘‘ఇటీవల అనంతపురంలో విద్యార్థిని తన్మయి హత్య జరిగింది. ఆ రోజు పోలీసులు సకాలంలో స్పందించి ఉంటే ఈరోజు తన్మయి బతికుండేది. ఈ ఘటనపై పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగితే సీఐను సస్పెండ్ చేశారు. ఈ రోజు పోలీసుల ఉదాసీనత కారణంగా కళ్యాణదుర్గంలో వివాహిత శ్రావణి ఆత్మహత్య చేసుకుంది. ఆమె ఆడియో రికార్డులు వింటుంటే మనసుకు ఆవేదన కలుగుతోంది. శ్రావణి దీనస్థితిలో మాట్లాడింది. కళ్యాణదుర్గం నియోజకవర్గ కేంద్రంలో డీఎస్పీ, సీఐ వంటి ఉన్నతాధికారులు ఉంటారు. తన కుటుంబంలోని పరిణామాలను పోలీసుల దృష్టికి తీసుకెళ్లినా స్పందించలేదని శ్రావణి ఆడియో ద్వారా స్పష్టమవుతోంది. పైగా తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా న్యాయం చేయలేదని ఆమె చెప్పింది. మరీ ఇంత దారుణమా? పోలీస్ ఉన్నతాధికారులతో మాట్లాడితే అక్కడున్న అధికారులు విచారణ చేస్తారని చెబుతున్నారు. నిజంగా అక్కడ పోలీసుల వల్ల ఆమెకు న్యాయం జరిగి ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేదా? శ్రావణి మృతిపై సమగ్ర విచారణ చేయాలి. ఉదాసీనంగా వ్యవహరించిన పోలీసులు ఎవరు? తెలుగుదేశం నాయకులు ఎవరో బహిర్గతం చేయాలి. వారిపై చర్యలు తీసుకోవాలి’’ అని అనంత డిమాండ్ చేశారు.
బాబు పాలనలో రైతుల పరిస్థితి దయనీయం*
చంద్రబాబు పాలనలో రైతాంగం పరిస్థితి దయనీయంగా మారిందని అనంత వెంకటరామిరెడ్డి అన్నారు. ‘‘జిల్లాలో 2024–2025 ఖరీఫ్, రబీలో అతివృష్టి, అనావృష్టితో పంటలు దెబ్బతిన్నాయి. 2024 బీమా పరిహారం ఇవ్వలేదు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో విత్తనం నుంచి విక్రయం వరకు ప్రభుత్వమే రైతులకు అండగా ఉండేది. కానీ నేడు ఆ పరిస్థితి లేదు. గతంలో పంటల బీమా ప్రీమియం ప్రభుత్వమే చెల్లించేది. కానీ నేడు రైతులే బీమా ప్రీమియం చెల్లించాల్సిన పరిస్థితి. ఖరీఫ్ సీజనల్‌లో రాష్ట్రంలో 86 లక్షల ఎకరాల్లో ప్రీమియం కట్టేవాళ్లు. కానీ నేడు కేవలం 14 లక్షల ఎకరాలకు మాత్రమే ప్రీమియం కట్టిన పరిస్థితి ఉంది’’ అని అనంత తెలిపారు.
*ప్రత్యామ్నాయ సాగుపై దృష్టి పెట్టరా?*
ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి జూన్, జూలై, ఆగస్టు తొలి వారం వరకు వర్షాల జాడ లేదని అనంత వెంకటరామిరెడ్డి తెలిపారు. ఇలాంటి తరుణంలో ప్రత్యామ్నాయ సాగుపై దృష్టి పెట్టరా? అని ప్రశ్నించారు. ‘‘ఖరీఫ్‌లో ఆగస్టు మొదటి వారం వరకు వర్షాలు పడలేదు. పంటలు ఎండిపోయాయి. కొన్ని చోట్ల వాడుపోయే పరిస్థితికి వచ్చింది. అయినా ప్రత్యామ్నాయ పంటల సాగు విషయంలో కనీసం ప్రణాళిక లేదు. వేరుశనగ, పత్తి, ఆముదం, కంది పంటలు పెట్టడానికి సీజన్ లేదు. ఇతర పంటలు వేసుకోవాలి. కానీ ఇంత వరకు ఒక్క సమావేశం జరగలేదు. అసలు ప్రజాప్రతినిధులు ఉన్నారా? వాళ్లకు ఆదాయం మీద ఉన్న దృష్టి రైతాంగ సమస్యలపై లేదు. ఎక్కడ చూసినా యూరియా, డీఏపీ కొరత వేధిస్తోంది. టన్నుల కొద్దీ యూరియా వస్తున్నా రైతులకు అందడం లేదు. బ్లాక్‌లో బస్తాకు అదనంగా రూ.100 చెల్లిస్తే అందిస్తున్నారు. అసలు డిస్ట్రిబ్యూటర్ల నుంచి యూరియా ఎక్కడకు వెళ్తోంది? ఏ డిస్ట్రిబ్యూటర్‌కు ఎంత వచ్చింది? ఎక్కడకు వెళ్తోంది? అనేది సమీక్షించరా?’’ అని అనంత వెంకటరామిరెడ్డి ప్రశ్నించారు.
ఎక్కడ చూసినా కబ్జాలు, మద్యం విక్రయాలు*
జిల్లా కేంద్రం నుంచి అన్ని నియోజకవర్గాల్లోనూ కబ్జాల పర్వం కొనసాగుతోందని అనంత వెంకటరామిరెడ్డి విమర్శించారు. గ్రామాల్లో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు కొనసాగుతున్నా పట్టించుకునే పరిస్థితి లేదన్నారు. ‘‘ఎక్కడ చూసినా బహిరంగంగా మద్యపానం జరుగుతోంది. హోటళ్లు, సోడా బంకుల్లోనూ మద్యం సేవిస్తున్నారు. మద్యం షాపులన్నీ ఎమ్మెల్యేల చేతుల్లో ఉండడంతో పోలీసులు పట్టించుకోవడం లేదు. పోలీసులకు శాంతిభద్రతలు పట్టించుకునే తీరిక లేదు. సాక్షాత్తూ ఎస్పీ మాట వినే పరిస్థితిలో కూడా కింది స్థాయి పోలీసులు లేరు. ఎవరైనా.. ఎక్కడైనా ఫ్లెక్సీలు కట్టాలంటే అధికార పార్టీ నేతలు అభ్యంతరం చెబితే చాలు సీఐ స్థాయి అధికారులే వెళ్తున్నారు. ఇందుకింత దిగజారి ప్రవర్తిస్తున్నారు? అని అనంత ప్రశ్నించారు.
Comments
Post a Comment